- ఖానాపూర్ ఆస్పత్రిలో అందుబాటులోకి అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్
ఖానాపూర్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని నిర్మల్‌జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. రూ 10 లక్షలతో ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ లేకపోవడంతో చుట్టుపక్కల గర్భిణులు నిర్మల్, మెట్ పల్లి, నిజామాబాద్ తదితర దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేసుకునేవారని తెలిపారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రికి త్వరలో కొత్త అంబులెన్స్ మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మౌనిక, వైస్ చైర్పర్సన్ షోయబ్, డీఎంహెచ్ వో రాజేందర్, డీసీహెచ్ఎస్ కాశీనాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ స్వర్ణ రెడ్డి, కౌన్సిలర్లు సత్యం, రమేశ్, సతీశ్, సత్యవతి, ప్రకాశ్, ఇంద్ర, ఆత్మ చైర్మన్ సత్యం, నాయకులు దయానంద్, రాజేందర్, షబ్బీర్, అమనుల్లాఖాన్,శోభన్ తదితరులు పాల్గొన్నారు.
